సికింద్రాబాద్, సెప్టెంబర్ 21:ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపు పరిస్థితులు నెలకొన్న రాంగోపాల్ పేట్ ప్రాంతాన్ని మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన వారు బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు, వరద బాధితులకు సహాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ తన వద్దే ఉంచుకున్నప్పటికీ, పాలనలో సౌలభ్యం అందించడంలో విఫలమయ్యారని అన్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, తాను వ్యక్తిగతంగా పేద ప్రజలకు సహాయం చేయడం ద్వారా బాధితులకు అండగా నిలిచానని, ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలని హితవు పలికారు. వరదల మూలంగా ప్రజలు ఇళ్లను కోల్పోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రధాన కారణమని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి వైఖరి, అతని హోదాకు తగిన విధంగా లేదని విమర్శించిన హరీష్ రావు, వెంటనే వరద ముంపు ప్రాంతాల్లో ఆర్థిక సహాయం, నిత్యావసరాల పంపిణీ చేపట్టాలని, అలాగే నాలాల పూడికతీత పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఇక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ, “బహిరంగంగా పార్టీ కండువా మార్చుకుని, పార్టీ మారలేదనడం సిగ్గుచేటు” అని మండిపడ్డారు.
బతుకమ్మ పండుగను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని, మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని కోరారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక గ్రామాలలో పాలన కుంటుపడుతోందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.