గుంటూరు, సెప్టెంబర్ 21: అతిసార లక్షణాలు కనిపించిన ప్రాంతాల్లో 33 బృందాలతో ఇంటింటి సర్వే జరుగుతోందని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అందించిన వివరాల మేరకు, 16వ తేదీ నుండి ఇప్పటి వరకు 80 కేసులు నమోదు అయ్యాయని, మిగిలిన కేసులు అంతకముందు విరేచనాలు లేదా వంతులు తదితర కారణాలుతో నమోదు అయ్యాయని తెలిపారు. అత్యవసర వార్డు నుండి సాధారణ వార్డులకు 13 మందిని మార్చడం జరిగిందని, 11 మందిని డిశ్చార్జ్ చేయడం జరిగిందని వివరించారు. అతిసార లక్షణాలుతో చేరిన బాధితుల ప్రాంతాలు – పాత గుంటూరు, సంగటిగుంట, ఎల్.బి. నగర్ తదితర ప్రాంతాలను రెడ్ జోన్ గా గుర్తించి విస్తృతంగా సర్వే చేయడం జరుగుతోందన్నారు. సర్వే చేస్తున్న ప్రాంతాల్లో అతిసార లక్షణాలు గల 6 గురుని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యు.పి.హెచ్.సి)లో వైద్య చికిత్స అందించామని చెప్పారు. యు.పి.హెచ్.సిలు రేయింబవళ్ళు పనిచేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని అన్నారు. ఆర్. ఓ నీటిని గాని, కొళాయి నీటిని గాని ప్రతి ఒక్కరూ మరగ కాచి చల్లార్చి తాగాలని, వేడి ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. చేతులు శుభ్రంగా కడగాలని సూచించారు. గ్రామంలో అనారోగ్య లక్షణాలు ఉంటే తక్షణం దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లాలని చెప్పారు.వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. వ్యాధుల సమాచారం అందించుటకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ 08963 2234014 నంబరుతో ఏర్పాటు చేశామని, దానికి సమాచారం అందించవచ్చని తెలిపారు.నగరపాలక సంస్థలు, పంచాయతీ పరిధుల్లో పారిశుధ్యం పక్కాగా చేపట్టాలని, తాగు నీటిపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు ఆమె చెప్పారు. రహదారి ప్రక్కన తినుబండారాలు విక్రయాలను తనిఖీ చేయాలని ఆదేశాల మేరకు గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు ఆదివారం వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఏ ప్రాంతం నుండీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నమోదు అయినా సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. పరిస్థితులకు అనుగుణంగా అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
1,009 1 minute read