Bpatla news :బాపట్ల:గ్రాంథికమ్ము నెత్తిన పిడుగు గిడుగు
బాపట్ల : వ్యవహారిక భాషా పితామహులు గిడుగు వెంకట రామమూర్తి అని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ అభివర్ణించారు. సాహితీ భారతి ఆధ్వర్యంలో బాపట్ల జమేదారు పేటలోని సాహితీ భారతి కార్యాలయంలో జరిగిన గిడుగు 85వ వర్ధంతి సభకు రావూరి నరసింహ వర్మ అధ్యక్షత వహించారు. ఎవరు ఎన్ని విధాలుగా వేధించినా గిడుగు రామ్మూర్తి పాఠ్య పుస్తకాలలో గ్రాంథిక భాషకు బదులు వ్యవహారిక భాషను ప్రవేశపెట్టటానికి ఎనలేని కృషి చేశారన్నారు .ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రజా కవి వైద్య విద్వాన్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ గిడుగు లిపిలేని సవర భాషకు కూడా లిపిని కనుగొన్నారన్నారు. సవర- ఇంగ్లీషు భాషానిఘంటువును కూడా రూపొందించారన్నారు .సాహితీ భారతి ఉపాధ్యక్షులు మర్రి మాల్యాద్రి రావు మాట్లాడుతూ గిడుగు బహుభాషా కోవిదులని అన్నారు. వారు గొప్ప సంఘసంస్కర్త హేతువాది అని కూడా తెలియజేశారు. గిడుగు జయంతి అయిన ఆగస్టు 29వ తేదీ “తెలుగు భాషా దినోత్సవం” గా ప్రకటించబడినదని అన్నారు. సాహితీ భారతి కోశాధికారి ఆదం షఫీ మాట్లాడుతూ గిడుగు చేసిన కృషికి రావు బహదూర్ , కైజర్-ఇ-హింద్, కళా ప్రపూర్ణ, డి లిట్ వంటి బిరుదులు ప్రదానం చేయబడ్డా యన్నారు. ఈ సభలో ఎం జాకబ్ కస్తూరి శ్రీనివాసరావు బొడ్డుపల్లి శ్రీరామచంద్రమూర్తి కాళిదాసు తదితరులు గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు