మచిలీపట్నం, సెప్టెంబర్ 22:ఈనెల 24వ తేదీన జిల్లాలో పర్యటించనున్న గౌరవనీయ భారత ఉపరాష్ట్రపతి సి. పి. రాధాకృష్ణన్ పర్యటనను దృష్టిలో ఉంచుకొని భద్రతా ఏర్పాట్లపై జిల్లా అధికారులు, కేంద్ర భద్రతా దళాల మధ్య సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఏ విషయంలోనూ లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సంపూర్ణ పర్యవేక్షణ అధికారి, సిఆర్‌పిఎఫ్ డీఐజీ కమలేష్ సింగ్ ఆదేశించారు.
సోమవారం ఉదయం ఆయన నేతృత్వంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన (ASL) భద్రతా సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీఐజీ హఫీజ్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, విమానాశ్రయం డైరెక్టర్ ఎమ్.ఎల్.కె. రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి రాకపోకలు, స్వాగత కార్యక్రమాలపై వారు సమీక్షించి, సంబంధిత ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమలేష్ సింగ్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి పర్యటన సమయంలో రోడ్ మాపింగ్, విమానాశ్రయం పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ వంటి ప్రత్యేక బలగాలను సిద్ధంగా ఉంచాలన్నారు. రాష్ట్ర పోలీసు విభాగంతో పాటు కేంద్ర బలగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ 24వ తేదీన సాయంత్రం 4:20 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని, 5:00 గంటలకు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ దర్శనానికి విజయవాడ చేరుకుంటారని తెలిపారు. అనంతరం 5:40కి పున్నమి ఘాట్ సందర్శించి, రాత్రి 7:20 గంటలకు తిరుపతి బయలుదేరుతారని వెల్లడించారు.
ఉపరాష్ట్రపతికి ఆహ్వానం పలికే ప్రముఖుల జాబితాను ముందుగా సిద్ధం చేయాలని, వారికి మంచినీరు, గ్రీన్‌రూమ్ వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఉపరాష్ట్రపతికి పోలీస్ గౌరవ వందనం ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆయన పర్యటన దృష్ట్యా పిన్నమనేని ఆసుపత్రిని సురక్షిత ఆసుపత్రిగా, గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిని కంటిన్యూజెన్సీ ఆసుపత్రిగా సిద్ధం చేయాలని తెలిపారు. రక్తపు గ్రూపులు, అంబులెన్సులు, అవసరమైన మందులు, డ్రైవింగ్‌కు వాహనాల స్థితిగతుల పరిశీలన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
విమానాశ్రయం చుట్టుపక్కల డ్రోన్ల ఎగరడాన్ని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాములు ప్రవేశించకుండా పాములు పట్టే నిపుణులను సిద్ధంగా ఉంచాలన్నారు.
ఉపరాష్ట్రపతికి సంబంధించిన మార్గాల్లో వీధిదీపాలు వెలిగేలా చూసి, రహదారులపై గుంతలు లేకుండా మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం తరపున విధులు నిర్వహించే ఉద్యోగులకు డ్యూటీ పాసులు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో సిఆర్పిఎఫ్ కమాండెంట్ ధర్మబీర్ జకర్, అసిస్టెంట్ కమాండెంట్ తేజ్ బహదూర్, డిపిఓ డాక్టర్ జె. అరుణ, డిఎస్ఓ మోహన్ బాబు, డిఎం శివరాం ప్రసాద్, డీఎంఅండ్ హెచ్‌వో డాక్టర్ ఏ. వెంకట్రావు, డిటిఓ శ్రీనివాస్, తాడిగడప మున్సిపల్ కమిషనర్ నజీర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధర్ రావు, జిల్లా అగ్నిమాపక అధికారి ఏ. సురత్నం, గన్నవరం ఎంపీడీవో స్వర్ణలత, తహసిల్దారు శివయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.