రేపల్లె, సెప్టెంబర్ 22: రాష్ట్ర అభివృద్ధిలో బాపట్ల జిల్లా టాప్ 3 లో ఉండేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ అన్నారు. సోమవారం ఉదయం రేపల్లె రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ యన్. రామలక్ష్మి, డీఎస్పీ ఏ. శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలు జిల్లాలో అన్ని స్థాయిలలో నిర్వహించబడతాయని తెలిపారు. PGRES ద్వారా వచ్చిన ప్రజా ఫిర్యాదులపై ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరగనుందని చెప్పారు.
అన్ని శాఖల అధికారులు తమ సంబంధిత ఫైల్స్‌ను e-ఆఫీస్ ద్వారానే పంపాలని సూచించారు.
భారీ వర్షాలకు ముందు జాగ్రత్తలు
ఈ నెల 26, 27 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రమాదగ్రస్త గ్రామాలను గుర్తించి బోట్లు, గజఇతగాలు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు సమర్థవంతంగా స్పందించాలని సూచించారు.
పారిశుద్ధ్యంపై కఠిన చర్యలు
జిల్లాలో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం సహించబోమని పేర్కొన్నారు. కొబ్బరి బొండాల చిప్పలు, చెత్త దిబ్బలు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని డిపిఓను ఆదేశించారు.
ఆరోగ్య రంగంపై దృష్టి
వర్షాల కారణంగా వచ్చే జ్వరాలపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని DM&HO, DCH అధికారులను ఆదేశించారు. వైద్యసిబ్బంది అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని, వాట్సాప్ గ్రూప్‌లో వైద్యాధికారులతో కలెక్టర్‌ను చేర్చాలని సూచించారు.
ప్రజా సమస్యలపై నిఘా
ప్రతి రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదులపై అప్డేట్ పొందుతానని, 24 గంటల వ్యవధిలో నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
వరద నియంత్రణ పనుల పరిశీలన
కలెక్టర్ డా. వినోద్ కుమార్ రేపల్లె మండలంలోని పెనుమూడి వాగు ప్రవాహం మరియు భట్టిప్రోలు మండలంలోని వరదలకు దెబ్బతిన్న కరకట్టలను పరిశీలించారు. ఇరిగేషన్ ఏఈ నుండి మరమ్మత్తుల వివరాలు తెలుసుకున్నారు.