బాపట్ల, సెప్టెంబర్ 22:జిల్లా పరిపాలనలో పారదర్శకత, నాణ్యత మరియు వేగవంతమైన సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి పని చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని వీక్షణ సమావేశ మందిరంలో పి.జి.ఆర్.ఎస్ సిబ్బందితో జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “బాపట్ల జిల్లా అన్ని పరిపాలనా విభాగాల్లో రాష్ట్రంలోనే ముందంజలో ఉండాలి. ర్యాంకింగ్‌లలో మొదటి మూడింటిలో నిలవాలంటే ప్రతి ఉద్యోగి పోటీ ధోరణితో పనిచేయాలి,” అని పేర్కొన్నారు. ప్రజల నుంచి పి.జి.ఆర్.ఎస్ ద్వారా వచ్చే ఫిర్యాదులను పూర్తిగా పారదర్శకంగా పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
పి.జి.ఆర్.ఎస్ కు సంబంధించి శాఖలు, మండలాల వారీగా నివేదికలు తయారు చేసి సమయానుకూలంగా అందించాలని సూచించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో ఎక్కడైనా సమస్యలు తలెత్తినపుడు వెంటనే స్పందించేందుకు కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని డా. వినోద్ కుమార్ డిఆర్ఓను ఆదేశించారు. ఈ కంట్రోల్ రూమ్ డిఆర్ఓ ఆధ్వర్యంలో పనిచేసి, ప్రతి శాఖకు ఒక ప్రతినిధి ఉండేలా చూడాలని చెప్పారు.
అదేవిధంగా, రెండు టీవీలను కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసి, న్యూస్ చానెళ్ల ద్వారా వచ్చే ముఖ్యమైన వార్తలను అధికారులకు వెంటనే తెలియజేసి, తగిన స్పందన తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి సంయుక్త కలెక్టర్ మరియు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, పిజిఆర్ఎస్ నోడల్ అధికారి నాగిరెడ్డి, పరిపాలన అధికారి మల్లికార్జున రావు, పిజిఆర్ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.