విజయవాడ, సెప్టెంబర్ 22:విజయవాడ నగరంలో సెప్టెంబర్ 23, 24 తేదీలలో లోక్‌సభ సభార్ధినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశాలు జరగనున్నట్లు మచిలీపట్నం ఎంపీ మరియు కమిటీ చైర్మన్ డా. వర్ణా బాలశౌరి వెల్లడించారు.
ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలను ప్రాతినిధ్యం వహిస్తున్న సుమారు 12 మంది లోక్‌సభ సభ్యులు హాజరుకానున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాంకింగ్, విద్యుత్, బీమా రంగాలపై విస్తృతంగా చర్చించేందుకు ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
బ్యాంకింగ్ రంగంపై చర్చ – సెప్టెంబర్ 23
సెప్టెంబర్ 23న నిర్వహించే సమావేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌ల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు పాల్గొననున్నారు. అలాగే, ఎన్టీపీసీ, ఆర్ఈసీ, పీఎఫ్సీ వంటి ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల సీఎండీలు కూడా సమావేశంలో పాల్గొంటారని ఎంపీ తెలిపారు.
ఈ సందర్భంగా బ్యాంకింగ్ రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, నూతన విధానాలు, సేవల విస్తరణపై లోతైన చర్చలు జరగనున్నాయని ఆయన వివరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టి సహా అనేక బ్యాంకింగ్ ప్రముఖులు ఈ సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు.
బీమా రంగంపై చర్చ – సెప్టెంబర్ 24
సెప్టెంబర్ 24న బీమా రంగానికి సంబంధించిన సంస్థలతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC), నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఓరియంటల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ప్రతినిధులు హాజరవుతారు.
బీమా రంగ అభివృద్ధి, రెగ్యులేటరీ సమస్యలు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమగ్రమైన చర్చలు జరగనున్నాయని బాలశౌరి తెలిపారు.