విజయవాడ, సెప్టెంబర్ 22: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. నవరాత్రి శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి వైభవంగా ప్రారంభమైన నేపథ్యంలో, ఆయన అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రిని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రాంనారాయణ రెడ్డి, ఆలయ ఈవో, వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయనతో పాటు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.
తర్వాత వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు.