
విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి కార్యాలయంలో దుర్గా మాతకు విశేష పూజలు నిర్వహించారు. గుంటూరు రేంజ్ లోని అన్ని జిల్లాల ప్రజలు, పోలీసులకు శాంతి భద్రతలు, సుఖ సంతోషాలు కలగాలని ఈ సందర్భంగా రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠీ కోరుకున్నారు. ఇందులో భాగంగా దుర్గా మాత చిత్ర పటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేంజ్ లోని ప్రతి జిల్లాలో శాంతి భద్రతలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలు స్వేచ్ఛగా జీవించాలని, దాని కోసం పోలీసులు పటిష్టంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. సంఘ విద్రోహశక్తులను అణచివేయడానికి అవసరమైన మనోధైర్యాన్ని, సాహసాన్ని, పోరాట పటిమను ప్రసాదించాలని దుర్గా మాతను ప్రార్థించారు. అదేవిధంగా వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, పోలీస్ అధికారులు, సిబ్బంది రాకపోకలలో దుర్గా మాత తోడుగా ఉండాలని ఆశించారు. అనంతరం దుర్గా మాత పూజలో పాల్గొన్న పోలీస్ అధికారులు సిబ్బంది ప్రతి ఒక్కరికి మిఠాయిలు పంచి, దసరా శుభాకాంక్షలు తెలిపారు.







