
పోలీస్ వారి రక్షణ మరియు భద్రతలో గుంటూరు జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని దుర్గా మాతను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. విజయ దశమి పర్వదినం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఆయుధ పూజా కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా ఎస్పీ పాల్గొన్నారు. జిల్లా ప్రజలు శాంతి భద్రతల కోసం, వారి సుఖజీవనం కొసం దుర్గా మాతను వేడుకున్నారు. జిల్లా ఆయుధాగారం వద్ద దుర్గాదేవికి నిర్వహించిన పూజలో బాగంగా వివిధ తుపాకులు, గన్స్, రైఫిల్స్ వంటి ఆయుధాలకు కూడా పూజలు నిర్వహించారు. జిల్లాలో శాంతి భద్రతలు, శాంతి సమాధానాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు స్వేచ్ఛగా జీవించాలని సంఘ విద్రోహ శక్తుల ఆగడాలు అంతం అవ్వాలని దుర్గా మాతను ఎస్పీ వకుల్ జిందాల్ దంపతులు మనస్పూర్తిగా వేడుకున్నారు. అదేవిధంగా ఎస్పీ దంపతులు విలుదారుల వలె విల్లులు ఎక్కుపెట్టి, విద్రోహ శక్తులను అణచివేసే విధంగా నలు దిక్కులకు విల్లంబులను సంధించారు. ఆద్యంతం ఎంతో చూడముచ్చటగా, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి ధైర్యాన్ని నింపేదిగా దుర్గామాత పూజ సాగింది. అదే విధంగా జిల్లా కమ్యూనికేషన్ కార్యాలయం వద్ద ఉన్న విజయ దుర్గా అమ్మవారి ఆలయంలో, జిల్లా పోలీస్ మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమంలో పాల్గొని వాహనాలకు పూజలు నిర్వహించారు. వాహన ప్రయాణాలలో అమ్మవారి అండతో పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి భద్రత చేకూరాలని వేడుకున్నారు.







