
మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా గుంటూరు మార్కెట్ సెంటర్లోని గాంధీ విగ్రహానికి సిపిఐ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, “గాంధీని హత్య చేసిన గాడ్సే వారసులు నేడు దేశాన్ని పాలించడం దుర్మార్గం. బిజెపి, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగ సవరణ చేయాలని చేసే కుతంత్రాలను సిపిఐ ప్రజలతో కలిసి తిప్పికొడుతుంది” అని హెచ్చరించారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ, “దేశంలో పెరుగుతున్న అసహనం, మత విద్వేషాలకు గాంధీ చూపిన అహింసే సమాధానం. యువత ఆయన ఆశయాలను గ్రహించాలి” అన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ, “గాంధీ చూపిన మార్గమే రాజ్యాంగాన్ని రక్షించే మార్గం. బిజెపి-ఆర్ఎస్ఎస్ కుతంత్రాలను అడ్డుకోవడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఆకీటి అరుణ్ కుమార్, సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న, నగర కమిటీ సభ్యులు జంగాల చైతన్య, విరిగినేని వెంకటేశ్వర్లు, పి. వి.జగన్నాథం, ఆకీటి రామచంద్రుడు, చినపోతుల శ్రీనివాస్, మత్తే అరుణ్, ఆకీటి గోపాలకృష్ణ, లింగరాజు, సైదారావు తదితరులు పాల్గొన్నారు.







