
వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలు మరింత మెరుగు పరిచేందుకు అధికారులు మేధోమధనం జరపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పౌర సేవల్లో ప్రజల సంతృప్తి స్థాయే ప్రభుత్వానికి ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఆర్టీజీఎస్, పౌర సేవలపై ప్రజల సంతృప్తి స్థాయిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సమాచార శాఖ మంత్రి కె.పార్ధసారధి, సీఎస్ కే.విజయానంద్, ఐటీ, ఆర్టీజీఎస్, సీఎంఓ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవల్లో ప్రజల సంతృప్త స్థాయి పెంచడంపై ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ప్రజల నుంచి ఐవీఆర్ఎస్‌తో పాటు క్యూఆర్ కోడ్ ద్వారా వెల్లడిస్తున్న అభిప్రాయాల్లో సానుకూలత ఏ స్థాయిలో ఉంది, అసంతృప్తి ఎక్కడెక్కడ ఉందన్న సమాచారాన్ని క్రోడీకరించాలని సూచించారు. తద్వారా సమస్య మూలాలను కనుగొని వాటిని వేగంగా పరిష్కరించటం ద్వారా ప్రజల్లో సంతృప్తి స్థాయిని మరింత మెరుగుపరుచుకోవచ్చని సీఎం పేర్కొన్నారు. ఆర్టీజీఎస్ డేటా లేక్‌లో అపారమైన సమాచారం నిక్షిప్తమై ఉందని తద్వారా డేటా ఆధారిత నిర్ణయాలను వేగంగా తీసుకునేందుకు ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రం యూనిట్‌గా ప్రభుత్వం 19 విభాగాల ద్వారా అందిస్తున్న సేవలపై ప్రతీ రోజూ దృష్టి సారించాలని అలాగే ప్రతీ 15 రోజులకూ ఒకసారి సమాచార సేకరణ చేయాలని సూచించారు. వీటిపై ప్రతీ నెలా ఆడిట్ నిర్వహించి ప్రతీ మూడు నెలలకూ ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు. దీనికోసం రాష్ట్రస్థాయితో పాటు జిల్లా, నియోజకవర్గం స్థాయిలో సమాచారం తీసుకుని విశ్లేషించాలని పేర్కొన్నారు. 15 నెలలుగా ప్రజల్లో సంతృప్తి స్థాయి క్రమంగా మెరుగు పడుతోందని ఇది మరింత పెరగాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సేవల్లో ప్రజలు ఎలా స్పందిస్తున్నారన్నదే ప్రధాన అంశమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత పాలకుల నిర్వాకం కారణంగా రెవెన్యూ రికార్డులు తారుమారై వివాదాలు పెరిగాయని… వాటిని సరిచేస్తున్నట్టు సీఎం తెలిపారు.







