గుంటూరు, అక్టోబర్ 6: నగరంలో సోమవారం నుండి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. పలు ప్రాంతాల్లో వరదనీరు చేరే అవకాశముండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇంజినీరింగ్ శాఖ అధికారులకు మోటార్లను సిద్ధంగా ఉంచి, వర్షపు నీటిని వెంటనే బైల్ అవుట్ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ముఖ్యంగా కంకరగుంట ఆర్యూబి వద్ద, రింగ్ రోడ్, చుట్టగుంట సెంటర్ పరిసరాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని, కల్వర్ట్‌ల వద్ద ఏర్పాటు చేసిన మెష్‌లను చెత్తతో బ్లాక్ కాకుండా తరచూ పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత డీఈఈలు మరియు ప్రజారోగ్య అధికారులకు ఆదేశాలిచ్చారు.
వర్షాల నేపథ్యంలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, ప్రజారోగ్య శాఖలతో పాటు వార్డు సచివాలయ కార్యదర్శులు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో త్రాగునీటి సరఫరాలో అంతరాయం రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఎఐఈలకు సూచించారు. వర్షాల వల్ల చెట్లు కూలినచో వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలని హెచ్‌డీహెచ్ అధికారిని ఆదేశించారు.
ఇక ప్రజలు త్రాగునీటిని కాచి చల్లార్చి త్రాగాలని సూచించిన కమిషనర్, వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా 24 గంటల జిఎంసి కాల్ సెంటర్ 08632-345103 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.