ఢిల్లీ: 06-10-2025 :-2027 జూన్‌లో పుష్కరాలకు ముందు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, అదే ఏడాది డిసెంబర్‌లో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ఢిల్లీ కేంద్రంగా సోమవారం జరిగిన పోలవరం పనుల సమీక్ష సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రాజెక్టు పనుల ప్రగతిపై కేంద్రం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసిందని వెల్లడించారు.
జగన్ పాలనలో ధ్వంసం – చంద్రబాబు పునరుద్ధరణ
2019-24 మధ్య కాలంలో యసర్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో పోలవరం ప్రాజెక్టు తీవ్రంగా నిర్లక్ష్యానికి గురైందని, దాంతో పాటు రాష్ట్రానికి 50,000 కోట్ల ఆదాయం నష్టపోయినట్లు మంత్రి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించి వేగంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు.
కేంద్రం పూర్తి సహకారం
పోలవరం పూర్తికి తమ వంతు సహకారం అందిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ హామీ ఇచ్చినట్లు రామానాయుడు తెలిపారు. ఎన్డీఏ పాలన కేంద్రంలో, రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వ సహకారంతో పోలవరం త్వరితగతిన పూర్తవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
విధ్వంసం – విశ్లేషణ
చంద్రబాబు హయాంలో 72% పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టు, తరువాతి ప్రభుత్వం కాలంలో నిర్లక్ష్యం వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని విమర్శించారు. 2014-19 మధ్య తాము ఖర్చు చేసిన రూ.3750 కోట్లు కేంద్రం తిరిగి విడుదల చేసినప్పటికీ, ఆ నిధులను జగన్ ప్రభుత్వం ఇతరత్రా ఖర్చులకు మళ్లించిందని ఆరోపించారు.
ప్రాజెక్టు లక్షణాలు – ప్రగతి వివరాలు
- ప్రాజెక్టు పూర్తయితే:
- 23.5 లక్షల ఎకరాల ఆయకట్టకు నీటి సదుపాయం
- 28.5 లక్షల మందికి తాగునీరు
- 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
- డయాఫ్రమ్ వాల్:
- మొత్తం 1398 మీటర్లలో ఇప్పటికే 686 మీటర్లు పూర్తయ్యాయి (56%)
- వరదకాలంలో కూడా పనులు నిలిపివేయకుండా కొనసాగుతున్నాయి
నిర్వాసితుల పునరావాసం
- ఫేజ్-1 (41.15 మీటర్ల కాంటూర్ వరకు):
- 38,060 కుటుంబాలు గుర్తింపు
- 20,946 కుటుంబాలకు 75 కాలనీలు అవసరం
- ఇప్పటికే 26 కాలనీలు పూర్తయినట్లు మంత్రి తెలిపారు
- మిగిలిన 49 కాలనీలు నిర్మాణంలో ఉన్నాయి
- 2026 మే నాటికి పూర్తి లక్ష్యం
- ఫేజ్-2:
- 2027 మార్చి నాటికి కాలనీల నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది
- నిర్మాణానికి రూ.900 కోట్లు కేటాయించి టెండర్లు పిలిచారు
నిధుల కొరత లేదు
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,157 కోట్లు మంజూరు చేసినట్టు, వాటిలో ఇప్పటివరకు రూ.5,052 కోట్లు విడుదల అయినట్లు మంత్రి వివరించారు. కేంద్రం దశలవారీగా నిధులు విడుదల చేస్తోందని, నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.
చివరగా, “పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు” అని చెప్పిన మాజీ సీఎం జగన్‌తో పోలిస్తే, గడువు నిర్ధారించి పనులు వేగంగా పూర్తి చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు దక్షతను ప్రజలు గమనించాలని మంత్రి రామానాయుడు సూచించారు.