బాపట్ల, అక్టోబర్ 7: ప్రముఖ ఐఏఎస్ అధికారి, ప్రజాసేవాకులైన ఎస్.ఆర్. శంకరన్ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శంకరన్ విగ్రహానికి పుష్పమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “శంకరన్ సుదీర్ఘకాలం సుపరిపాలన, ప్రజా సంక్షేమం కోసం నిరంతరంగా పని చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా ఆయన స్పూర్తిని అనుసరించి, పేద ప్రజలకు సేవచేయాలనే తపనతో విధులు నిర్వర్తించాలి,” అని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి శంకరన్ చేసిన కృషి అభినందనీయమని ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఫుడ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు కలెక్టర్ బహుమతులు, పతకాలు అందజేశారు.
ఫోరం కార్యదర్శి డా. పి.సి. సాయిబాబు మాట్లాడుతూ, “శంకరన్ నిజాయితీ, నిస్వార్థం, నిరాడంబరతకు ప్రతీక. ఆయన జీవితం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుంది,” అని తెలిపారు. పరిపాలన ప్రజల దగ్గరకి తీసుకురావడంలో ఆయన పాత్ర అమూల్యమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు, ఫోరం సభ్యులు జీవి, మానం అప్పారావు, కరణం రవీంద్ర, బందా బాబు, డా. వినోద్ (ఫుడ్ సైన్స్ కళాశాల అధ్యాపకులు), వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.