కర్లపాలెం, అక్టోబర్ 7: బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని కొత్త నందాయ పాలెం గ్రామంలో జల జీవన్ మిషన్ అమలులో అధికారుల నిర్లక్ష్యంపై ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు తీవ్రంగా విమర్శలు చేశారు.
స్థానిక సర్పంచ్ ఆట్ల వెంకటేశ్వరమ్మ, అయ్యప్ప రెడ్డితో కలిసి గ్రామ సభలో పాల్గొన్న తాండ్ర సాంబశివరావు, గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై అధికారులతో చర్చించి కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గ్రామానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రూ.26.5 లక్షల నిధులు మంజూరైనప్పటికీ, ఇప్పటికీ సుమారు 120 ఇళ్లకు మంచి నీటి కనెక్షన్లు ఇవ్వలేకపోవడం బాధాకరం,” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా ప్రతినిధిగా పలు మార్లు అధికారులను అడిగినప్పటికీ, సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో పాటు, ఇప్పుడు వచ్చి పొంతనలేని సమాధానాలు ఇవ్వడం దురదృష్టకరమని అన్నారు.
RWS AE వసుధను వివరణ కోరగా, మళ్లీ కొత్త అంచనాలు తయారుచేస్తామని తెలిపిన విషయాన్ని తాండ్ర తీవ్రంగా తప్పుబట్టారు. “ఇప్పటికే అంచనాల ప్రకారమే నిధులు మంజూరయ్యాయి. మరి మళ్లీ అంచనాలు ఎందుకు? అప్పట్లో ఎందుకు సరైన అంచనాలు వేయలేదు? పని పూర్తికాకుండానే కాంట్రాక్టర్కు ఎలా బిల్లులు చెల్లించారు?” అని ఆయన ప్రశ్నించారు.
జల జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్ ఇవ్వాల్సి ఉన్నా, మరో 120 ఇళ్లకు కనెక్షన్లు లేకపోవడం బాధాకరమని పేర్కొంటూ, దీనికి బాధ్యత వహించాల్సింది అప్పటి అధికారులు అని తేల్చి చెప్పారు. దీనిపై బాపట్ల జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని తాండ్ర సాంబశివరావు డిమాండ్ చేశారు.
ఈ గ్రామ సభ కార్యక్రమంలో సెక్రటరీ మురళి రెడ్డి, సచివాలయం సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.