అమరావతి, అక్టోబర్ 8:
నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం అందుబాటులోకి రావడంతో విద్యార్థులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కాలంలో ట్రిపుల్ ఐటీ మెస్ సేవలపై విద్యార్థుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో, విద్యా మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తక్షణ స్పందనతో మెస్ నిర్వహణ బాధ్యతలను అక్షయపాత్రకు అప్పగించారు.
ప్రస్తుతం అందుతున్న ఆహారం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో విద్యార్థులు సంతృప్తిని వ్యక్తపరిచారు. “మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, భోజనం నాసిరకంగా ఉంది” అంటూ గళమెత్తిన విద్యార్థులకు ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం లభించిందని వారు పేర్కొన్నారు.
“మా సమస్యను స్వయంగా చూసుకుని, మాట నిలబెట్టుకున్న నారా లోకేష్ గారికి మనఃపూర్వక ధన్యవాదాలు,” అని వారు తెలిపారు. ఈ మార్పు శాశ్వతంగా కొనసాగాలని విద్యార్థులు కోరారు.