హైదరాబాద్, అక్టోబర్ 8:గ్రూప్-1 పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలకు వ్యతిరేకంగా, నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గన్ పార్క్‌లో భారీ స్థాయిలో ధర్నా జరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ ధర్నాకు నేతృత్వం వహించారు.
ధర్నాలో జాగృతి కార్యకర్తలు, గ్రూప్ 1 అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “గ్రూప్ 1 అభ్యర్థులకు ధైర్యం ఇచ్చేందుకు ఈ ధర్నా నిర్వహిస్తున్నాం. గ్రూప్ 1 పరీక్షను తప్పుడు విధంగా నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు. పరీక్ష రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు” అని హెచ్చరించారు.
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
కవిత మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వచ్చి నిరుద్యోగుల కాళ్లపట్టుకొని ఓట్లు అడిగారు. కానీ ఇప్పుడవారినే మోసం చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు. పాత ఉద్యోగాల పేరుతో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది” అని మండిపడ్డారు.
అంతేగాక, “కాంగ్రెస్ నేతల కుటుంబాలకు బోనస్ ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ నిరుద్యోగులకి మాత్రం బోగస్ ఉద్యోగాలు. ఇదేనా న్యాయం?” అని ప్రశ్నించారు. ప్రెసిడెంటల్ ఆర్డర్‌ను ఉల్లంఘించి 8 మంది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడాన్ని ఆమె తీవ్రంగా విరోధించారు.
మేధావులు స్పందించాలి: కవిత
తెలంగాణలో మేధావులు మౌనం వీడాలని, హరగోపాల్ సార్ కూడా ఈ వ్యవహారంపై స్పందించాలని ఆమె కోరారు. అవసరమైతే ఆయనను కలిసే అవకాశం ఉందని వెల్లడించారు.
“తెలంగాణ తెచ్చుకున్నది నియామకాల కోసమే. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత లేకపోతే మేము నిశ్శబ్దంగా ఉండం. త్వరలోనే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి, గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం” అని కవిత స్పష్టం చేశారు.