అమరావతి, అక్టోబర్ 8:రాజధానిలో మీడియా వర్గాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏర్పాటైన ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సచివాలయంలో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలుపుతూ, “మీడియా స్వేచ్ఛకు మా పూర్తి మద్దతు ఉంటుంది. రాజధానిలో జర్నలిస్టులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని హామీ ఇచ్చారు.
వెబ్‌సైట్ ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ, ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి కమిటీ సభ్యులు క్లబ్ అభివృద్ధికి తీసుకుంటున్న ప్రయత్నాలను సీఎం అభినందించారు. 2018లో అమరావతి ప్రెస్ క్లబ్‌ను స్థాపించినట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. అప్పటినుంచి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ, మీడియా వర్గాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నట్లు వివరించారు.
ప్రెస్ క్లబ్‌కు అత్యాధునికంగా భవనం నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు కూడా కమిటీ సభ్యులు వెల్లడించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని ప్రెస్ క్లబ్‌లు పరిశీలించి, వాటిని ఆదర్శంగా తీసుకొని డిజైన్ సిద్ధం చేసినట్లు చెప్పారు. దీనికోసం అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం కేటాయించాలని కోరగా, ముఖ్యమంత్రి దీనిపై సానుకూలంగా స్పందించారు.
వెబ్‌సైట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారు:
ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అప్పాజీ, జనరల్ సెక్రటరీ సతీష్ బాబు, వైస్ ప్రెసిడెంట్ నారాయణ, ట్రెజరర్ కె. పూర్ణచంద్రరావు, జాయింట్ సెక్రటరీ మహేష్, సభ్యులు శ్యామ్ సుందర్, మల్లేశ్వరరావు, శ్రీనివాస్, కె. గాంధీబాబు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.