
నగరంలో త్రాగు నీటి పైపు లైన్లకు లీకులు ఏర్పడితే వెంటనే వాటికి మరమ్మతులు నిర్వహించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం నగర పర్యటనలో భాగంగా బ్రాడిపేట, శంకర్ విలాస్ ఆర్.ఓ.బి పనులు, డొంక రోడ్డు మరియు శ్రీనగర్ ప్రాంతాలలో పర్యటించి త్రాగు నీటి పైపు లైన్లు మరియు పారిశుధ్య పనులను తనిఖీ చేసి తీసుకోవాల్సిన చర్యల పై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో తొలుత బ్రాడీపేట ప్రాంతంలో ప్రాంతంలో పర్యటించి, సదరు ప్రాంతంలో త్రాగు నీటి పైపు లైన్ లీకు ఉండుట గమనించి, వెంటనే సదరు పైపు లైన్ కు మరమ్మతులు నిరహించాలని ఆదేశించారు.
అలాగే నగరంలో ఎక్కడ పైపు లైన్లకు లీకులు ఏర్పడినా సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు బాధ్యత తీసుకొని వెంటనే వాటికీ మరమ్మతులు నిర్వహించి, త్రాగు నీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. అంతేకాక సైడు కాలువల్లో త్రాగు నీటి పైపులు ఉంటె వాటిని తొలగించాలని ఇప్పటికే పలుమార్లు ఆదేశించుట జరిగిందని, ఇంకా ఏమైనా పైపు లైన్లు సైడు కాలువల్లో ఉంటె వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. అనంతరం శంకర్ విలాస్ ఆర్.ఓ.బి నిర్మాణ ప్రాంతాన్ని తనిఖీ చేసి, సదరు ప్రాంతంలో పిల్లర్స్ నిర్మాణం కొరకు తవ్విన మట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా యుద్ద ప్రాతిపదికన తొలగించాలని, అంతేకాక సర్వీస్ రోడ్డులో రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మట్టి తొలగించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం దొంక రోడ్డు మరియు శ్రీనగర్ ప్రాంతాలలో పర్యటించి పారిశుధ్య పనులను తనిఖీ చేసి, కమర్షియల్ వ్యర్ధాలను సేకరిస్తున్న ఏజెన్సి వారు సేకరించిన వ్యర్ధాలను రోడ్ల మార్జిన్లలో వేయకుండా పర్యవేక్షణ చేయాలని, అలాగే పారిశుధ్య కార్మికులు ప్రతి రోజు ఉదయం ప్రధాన రహదారులు శుభ్రం చేసి, డోర్ టు డోర్ వ్యర్ధాలను సేకరించాలని, మధ్యాన్నం విధిగా సైడు కాలువలను శుభ్రం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఈ.ఈ వేణు, ఎ.సి.పి రెహమాన్, యస్.యస్ లు, ఏ.ఈ లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.







