
గుంటూరు;11-10-2025;-గుంటూరు నగర ప్రజల సౌకర్యార్ధం ఆధునిక వసతులతో కూడిన కొత్త రైతు బజార్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. బృందావన్ గార్డెన్స్‌లోని కుందుల రోడ్డుపై ఈ రైతు బజార్ నిర్మించనున్నట్లు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మరియు కమిషనర్ పులి శ్రీనివాసులు శనివారం ప్రకటించారు.
మార్కెటింగ్ శాఖ, నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా అధికారులతో కలిసి proposed రైతు బజార్ ప్రదేశాన్ని పరిశీలించిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రైతు బజార్ కోసం నగరపాలక సంస్థ ఇప్పటికే స్థలాన్ని కేటాయించిందని, అలాగే నిర్మాణానికి అవసరమైన నిధులను మార్కెటింగ్ శాఖ మంజూరు చేసిందని తెలిపారు.
రైతు బజార్‌ను ఆధునిక మోడల్ ఆధారంగా నిర్మించాలని, రెండు అంతస్తుల్లో విశాలమైన షాపులు, సెల్లార్ పార్కింగ్ వసతి వంటి మౌలిక సదుపాయాలతో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మేయర్ ఆదేశించారు.
అంతేగాక, నిర్మాణ ప్రదేశంలో స్థల సర్వేను సమగ్రంగా నిర్వహించి, ఎలాంటి ఆక్రమణలు ఉన్నా, చట్టపరంగా తొలగించాలని సిటి ప్లానర్ మరియు సర్వేయర్లకు సూచించారు. రైతు బజార్ పరిసర ప్రాంతాల్లో రహదారి పైన ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే ఆక్రమణలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ అన్నారు.
ఈ పరిశీలనలో సిటి ప్లానర్ రాంబాబు, ఏసిపి రెహ్మాన్, మార్కెటింగ్ శాఖ ఏడి సత్యనారాయణ చౌదరి, కార్పొరేటర్ ఈరంటి వర ప్రసాద్, ఇతర అధికారులు, సిబ్బంది మరియు స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు.







