
నూజివీడు, అక్టోబర్ 11, 2025:ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా నిర్మించిన డాగ్ కెనల్స్‌ను నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐపీఎస్ గారు ఈ రోజు లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్ సమీపంలో ఈ కెనల్స్‌ను నిర్మించారు.
ప్రముఖులు, వీవీఐపీలు మరియు ఇతర ముఖ్య వ్యక్తులు నగరానికి విచ్చేసే సందర్భాల్లో వారి భద్రత కోసం, నార్కోటిక్స్, నేర పరిశోధనలు, బందోబస్తు క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు, బాంబు తదితర ఎక్స్ప్లోసివ్ వస్తువులను గుర్తించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన పోలీస్ డాగ్స్ సేవలు ఎంతో కీలకమవుతున్నాయి. ఈ నేపథ్యంతోనే, ఆగస్టు నెలలో భూమి పూజ జరిపిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు విజయవంతంగా పూర్తి కావడంతో ప్రారంభోత్సవం నిర్వహించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో శిక్షణ పొందిన డాగ్స్, కమిషనర్ గారికి గౌరవ వందనం తెలిపి, తమ ప్రతిభను వివిధ డెమో ప్రదర్శనల ద్వారా పోలీస్ అధికారులకు చూపించాయి.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ శ్రీమతి కె.జి.వి. సరిత ఐపీఎస్, డీసీపీలు కె. తిరుమలేశ్వర రెడ్డి ఐపీఎస్, ఏ.బి.టి.ఎస్. ఉదయరాణి ఐపీఎస్, సి.ఎస్.డబ్ల్యూకె ఎస్.వి.డి. ప్రసాద్, ఏఆర్ ఏడీసీపీ శ్రీ కె. కోటేశ్వరరావు, ఏసీపీలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు విభాగంలో డాగ్ స్క్వాడ్ కీలక భూమిక పోషిస్తోందని, భవిష్యత్తులో మరిన్ని ఆధునికీకరణ చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ కార్యక్రమం ముగింపులో తెలిపారు.







