
యద్దనపూడి, అక్టోబర్ 11:పర్చూరు నియోజకవర్గ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా యద్దనపూడి మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఈ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలిపారు.
ఈ శిబిరాన్ని ఏలూరి నాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్, నోవా అగ్రి గ్రూప్, గ్రీన్ స్పార్క్ ఫౌండేషన్ సంయుక్తంగా, శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కేవలం కంటి పరీక్షలే కాకుండా, బీపీ, షుగర్, రక్త పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించనున్నారని చెప్పారు.
అవసరమైతే నిపుణుల పర్యవేక్షణలో శస్త్రచికిత్సలు కూడా ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, భోజనం, వసతి వంటి అన్ని సదుపాయాలు కల్పించామన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి ప్రజలను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.







