
విజయవాడ పున్నమి ఘాట్ వద్ద ఎంపీ కేశినేని శివనాథ్ గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను ఘనంగా ప్రారంభించారు. బేరం పార్క్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ, జిల్లా అధికారులు మరియు వీఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడింది.

సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో జీఎస్టీ తగ్గింపు పై అవగాహన కల్పించేందుకు ఈ ఫెస్టివల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షాపింగ్ ఉత్సవం ఈనెల 13వ తేదీ నుండి 19వ తేదీ వరకు కొనసాగనుంది.ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జీఎస్టీ తగ్గింపు పై ముమ్మరంగా ప్రచారం సాగుతోందని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో ఈ వారం షాపింగ్ ఫెస్టివల్స్ నిర్వహించడం ద్వారా ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలన్నదే లక్ష్యమని చెప్పారు.
జీఎస్టీ 10 శాతం తగ్గింపుతో ప్రజలకు, వ్యాపార వర్గాలకు పెద్ద ఊరట లభించిందని తెలిపారు. దీని వల్ల స్వదేశీ వస్తువుల వినియోగం పెరగడం తోపాటు, ఎమ్.ఎస్.ఎమ్.ఈ.లు తమ ఉత్పత్తులను ప్రజలకు చేరవేయడానికి ఇది ఒక మంచి వేదికగా నిలుస్తుందని ఆయన వివరించారు.దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడ ప్రజలకు ఇది ఒక బొనాంజాగా మారనుందని ఎంపీ అభిప్రాయపడ్డారు. వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధన దిశగా జీఎస్టీ తగ్గింపు ఓ కీలక అడుగుగా మారుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశా, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియా, వీఎంసీ కమిషనర్ ద్యానచంద్ర, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ప్రశాంత్ కుమార్, టిడిపి రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు.







