
అమరావతి, అక్టోబర్ 13:-రాజధాని అభివృద్ధి యాత్రకు శుభారంభమైంది. గుంటూరు జిల్లాలోని అమరావతిలో జీ+7 స్థాయిలో నిర్మించిన సీఆర్డీఏ భవనాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 9.55 గంటలకు రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ, “రాష్ట్ర విభజన సమయంలో రాజధాని ఎక్కడ వేయాలనే స్పష్టత లేకుండా ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టారు. ఆ సమయంలో అమరావతి రైతులు నా మార్గదర్శకులయ్యారు. వాళ్ల త్యాగంతోనే రాజధాని నిర్మాణానికి భూములు లభించాయి,” అని గుర్తుచేశారు.“అమరావతిని కేవలం మునిసిపాలిటీగా మిగిలిపోకుండా, సమగ్ర అభివృద్ధి చెందేలా మారుస్తాం. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూములిచ్చిన రైతులకు రెట్టింపు గౌరవం, లాభాలు కల్పిస్తాం. సీఆర్డీఏ భవన ప్రారంభం రాజధాని పునర్నిర్మాణానికి మైలురాయిగా నిలుస్తుంది” అని సీఎం స్పష్టం చేశారు.
రాజధాని పోరాటంలో జోలె పట్టిన రోజులు గుర్తుచంద్రబాబు మాట్లాడుతూ, “రాజధాని రద్దు సమయంలో అమరావతి మహిళా రైతులు రోడ్డెక్కి పోరాడారు. వారి త్యాగానికి మద్దతుగా నేనూ జోలె పట్టాను. వారి కష్టాలను మర్చిపోనివ్వం. భవిష్యత్‌లో ఫలితాలను రైతులే అనుభవించేలా చేస్తాం. అమరావతి పరిపాలనకు కేంద్ర బిందువుగా మారుతుంది. ‘ఇంటికో పారిశ్రామికవేత్త’ విధానం అమరావతి నుంచే ప్రారంభమవుతుంది. క్వాంటం వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతాం,” అన్నారు.రైతుల సమస్యల పరిష్కార బాధ్యత ముగ్గురికేరాజధాని రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రైతుల సమస్యల పరిష్కార బాధ్యతను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, తెనాలి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్‌లకు అప్పగించారు. ఈ ముగ్గురు నిరంతరం రైతులతో సంప్రదింపులు జరిపి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఏ సమస్య పరిష్కారంకాకపోతే తాను ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటానని చెప్పారు.“హైటెక్ సిటీ ప్రారంభంలో ఎకరం భూమి విలువ రూ.లక్ష మాత్రమే ఉండేది. ఇప్పుడు రూ.177 కోట్లకు పెరిగింది. అలానే అమరావతి భూములకు కూడా విలువ పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తిగా సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో జరుగుతుంది” అని వివరించారు.పవన్ కల్యాణ్, బీజేపీతో కలిసి ముందుకురాష్ట్ర అభివృద్ధిలో ఏ విఘాతం ఉండకూడదని, గతంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదని సీఎం హెచ్చరించారు. “పవన్ కల్యాణ్, బీజేపీలతో కలిసి కూటమిగా పని చేస్తూ శాశ్వత ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. విశాఖ కూడా అద్భుతంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో వచ్చిన అతి పెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చేది,” అని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు శ్రావణ్ కుమార్, ధూళిపాళ నరేంద్ర, కొలికపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.







