
విజయవాడ, అక్టోబర్ 14:జీవో నెంబర్ 80 – 82 వల్ల నష్టపోయిన విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ, నాన్ లోకల్ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. విజయవాడ సెంటర్ నియోజకవర్గంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో సమావేశమైన వారు, విద్యాశాఖ తీసుకున్న తాజా నిబంధనల వల్ల తమ పిల్లలు న్యాయమైన సీట్లు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సమావేశంలో పాల్గొన్న నరేష్, జావేద్, విజయేంద్ర తదితరులు మాట్లాడుతూ, తమ పిల్లలు పదో తరగతి వరకు ఆంధ్రప్రదేశ్‌లోనే చదివినప్పటికీ, ఇంటర్మీడియట్‌ను హైదరాబాద్‌లో చదివారని, ఉమ్మడి రాజధానిలో చదివిన వారిని ‘నాన్ లోకల్’గా పరిగణించడం అన్యాయమన్నారు. వారు 7 సార్లు విద్యాశాఖ మంత్రిని కలిసి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని తెలిపారు.“మా పిల్లలు మంచి మార్కులు సాధించినా, జీవోలు 80 – 82 కారణంగా సీట్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు,” అని వారు తెలిపారు. తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం తీసుకున్న జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పలువురు తల్లిదండ్రులు పాల్గొన్నారు.







