ఆంధ్రప్రదేశ్గుంటూరు

Guntur News: సమర్థవంతమైన నాయకుల ఎంపికలో యువ ఓటర్లు కీలకం

NATIONAL VOTERS DAY

భవ్యమైన, దివ్యమైన భారత నిర్మాణంలో సమర్థవంతమైన నాయకుల ఎంపికలో యువ ఓటర్లు కీలకమని ,యువత తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్వ జాతీయ అధ్యక్షులు ప్రముఖ వైద్యులు డా|| జి. సమరం అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిఐటి కళాశాల మరియు జనచైతన్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన విబిఐటి ఆడిటోరియంలోనిర్వహించిన 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ సభకు డా||జి. సమరం ప్రధాన వక్తగా హాజరయ్యారు. ఈ సభకు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించగా, వివిఐటి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త డా|| జి. సమరం మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటర్లే యజమానులని పాలకులు సేవకులుగా మాత్రమే పనిచేయాలన్నారు. బ్రిటిష్ పాలన అవశేషాలు ఇంకా దేశంలో మిగిలి ఉన్నాయని అవి తొలగి పోవాలంటే అవగాహనతో ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సామాజిక బాధ్యతగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కలిగించాలని సూచించారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఓటు ప్రజలకు ఆయుధమని ప్రభుత్వాల మార్పుకు ఒక సాధనం అన్నారు. కుల, మత, వర్గాలకు అతీతంగా పార్టీల లక్ష్యాలు, ఆశయాలు, అభ్యర్థుల త్యాగాలు కృషిని గమనించి ఓటు హక్కు వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రజాస్వామ్యం పరిరక్షించాలంటే ఎన్నికల వ్యయం గణనీయంగా తగ్గాలని కోరారు. ప్రపంచంలో అత్యధిక ఎన్నికల వ్యయం గల దేశంగా భారతదేశం మారుతుందని దీనివలన ఎన్నికలు కుబేరుల మధ్య పోటీగా మారిందన్నారు. 1951 లో 17 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని నేడు 100 కోట్లకు ఓటర్లు చేరినారన్నారు. ఓటు వేయడం ప్రాథమిక హక్కుగా, బాధ్యతగా ప్రతి ఓటరు భావించాలన్నారు. ప్రపంచంలో 112 దేశాలు ప్రజాస్వామిక దేశాలుగా ఉండగా మిగిలిన 80 దేశాలు రాజరిక, నిరంకుశత్వ దేశాలుగా కొనసాగుతున్నాయన్నారు. 1952లో లోక్ సభ, రాజ్యసభలు 155 రోజులు పనిచేయగా నేడు 50 రోజులకే పరిమితమైనాయని, శాసనసభలు సగటున 1952లో వంద రోజులకు పైగా పనిచేస్తుంటే నేడు 20 రోజులలోపే పనిచేస్తున్నాయన్నారు. సామాజిక విశ్లేషకులు టి. ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు ఆర్థిక, రాజకీయ అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. ఈ సందర్భంగా ఎన్నికలలో డబ్బు, మద్యం పాత్ర లేకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. సామాజిక అంశాలపై విద్యార్థులను చైతన్య పరుస్తూ రంగం రాజేష్ బృందం ప్రదర్శించిన గీతాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో వివిఐటి ప్రిన్సిపాల్ డా|| వై. మల్లికార్జున రెడ్డి, ఎన్ ఎస్ ఎస్ అధికారి డా|| ఐ. ఎల్. జె. భక్తా సింగ్ , విద్యార్థినీ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button