
గుంటూరు :నాగార్జున నగర్, అక్టోబర్ 14:-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణ దళం (APSPF) రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు మంగళవారం నాడు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలోని క్రీడా ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఏ.పి.ఎస్.పి.ఎఫ్ డైరెక్టర్ జనరల్ డా. సి.యం. త్రివిక్రమ వర్మ ముఖ్య అతిథిగా హాజరై, ఇన్‌స్పెక్టర్ జనరల్ బి.వి. రామి రెడ్డితో కలిసి ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు.ఈ క్రీడా పోటీలు ఏ.పి.ఎస్.పి.ఎఫ్ 34వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించబడుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ యూనిట్లకు చెందిన సుమారు 200 మంది సిబ్బంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. వాలీబాల్, బాడ్మింటన్, 100 మీటర్లు, 400 మీటర్లు, 5 కిలోమీటర్ల పరుగు పందెంలు పోటీ విభాగాల్లో కొనసాగనున్నాయి.
ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ త్రివిక్రమ వర్మ మాట్లాడుతూ, క్రీడల ద్వారా సిబ్బందిలో క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, ఐకమత్యం పెరుగుతాయన్నారు. క్రీడల్లో గెలుపు-ఓటమి కాకుండా క్రీడాస్ఫూర్తికే అధిక ప్రాధాన్యత ఉందని స్పష్టం చేశారు. ఏ.పి.ఎస్.పి.ఎఫ్ బలోపేతానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని, నూతన నియామకాలతో నూతనోత్సాహం తీసుకొచ్చేలా కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వానికి ఏ.పి.ఎస్.పి.ఎఫ్ పై మంచి నమ్మకం ఉందని, ఆ విశ్వాసాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు.ఇన్‌స్పెక్టర్ జనరల్ బి.వి. రామి రెడ్డి మాట్లాడుతూ, త్రివిక్రమ వర్మ బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాఖలో అనేక వినూత్న మార్పులు చోటుచేసుకున్నాయని, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మినీ శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం స్థలాలు కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు, పదోన్నతులు, నియామకాల పట్ల కూడా పెద్దపీట వేశారని పేర్కొన్నారు.ఈ క్రీడా పోటీల్లో విజయవాడ జోన్ కమాండెంట్ ముద్దాడ శంకర్రావు, కమాండెంట్ డి.ఎన్.ఏ. భాషా, అసిస్టెంట్ కమాండెంట్లు, ఇన్‌స్పెక్టర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. పోటీలతో పాటు పరేడ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.







