
తాగునీటి సరఫరా వ్యవస్థలో నిర్లక్ష్యం వహించే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. జిల్లాలో తాగునీటి వసతులు, సరఫరాపై కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటి సరఫరా, వైద్య ఆరోగ్య శాఖ, సంక్షేమ శాఖలతో మంగళవారం జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తాగునీటి సరఫరా, పర్యవేక్షణలో అత్యంత జాగ్రత్తగా ఉండాలన్నారు. వివిధ దశలలో నిర్దేశిత సమయంలో చేపట్టాల్సిన పరీక్షలు నిర్వహించకపోయినా, పైప్ లైన్లు నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా ప్రజా ఆరోగ్యం పట్ల తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. అధికారులు, సిబ్బంది తమ దీర్ఘకాలిక అనుభవంతో ప్రజలకు మంచి జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక మీదట ఎక్కడా ఎటువంటి సంఘటనలు రాకూడదని స్పష్టం చేశారు. తాగునీటి నమూనాలు సేకరించి నప్పుడు ఎక్కడ నుంచి సేకరించింది స్పష్టంగా వివరాలు పొందుపరచాలన్నారు. తాగునీటి నమూనాల సేకరణ, వాటి పరీక్షలు, ఫలితాలు, ఇతర నివేదికలు నిర్దేశిత కాలంలో చేయాలని ఆదేశించారు. వాటికి ఎస్.ఓ.పి ఉంటే వాటిని పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి నివేదిక విధిగా వివరాలు కలిగి ఉండాలని చెప్పారు. ఎటువంటి సంఘటనలు ఎక్కడా జరగరాదని, అందుకు ప్రతి రోజు అన్ని అంశాలను ముందుగానే పర్యవేక్షణ చేసుకోవాలని అన్నారు.
అనుకోని విధంగా ఒక సంఘటన జరిగితే తక్షణ స్పందన, నివారణపై శ్రద్ధ వహించాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాపై దృష్టి సారించడం వలన చాలా వరకు ఆరోగ్య సమస్యలు నివారించగలమని అన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఎం.ఎల్.హెచ్.పిలు వారి పరిధిలో ఉన్న వసతి గృహాలు వద్ద తాగునీటి సరఫరా, వసతుల నమూనాలు సేకరించి నీటి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రజా ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం వీలైనంత ఎక్కువ సంఖ్యలో తాగునీటి నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అనధికార, అనుమతులు లేని ఆర్.ఓ లను గుర్తించాలని అన్నారు. పారిశుధ్యం ఎక్కడా లోపం లేకుండా చూడాలని ఆమె ఆదేశించారు. ప్రజా ఆరోగ్య శాఖ పర్యవేక్షక ఇంజనీర్ డి.శ్రీనివాస్ గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి తమ విభాగాల్లో చేపడుతున్న నీటి నమూనాల సేకరణ, పరీక్షలు తదితర అంశాలను వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ సంచాలకులు శోభారాణి మాట్లాడుతూ గత ఏడాది తెనాలి మండలం కొలకలూరి గ్రామం ఎస్.సి కాలానికి నేరుగా నీటి పథకంకు ఎక్కించిన నీటిని సరఫరా చేయడం జరిగిందని, నీటి పథకం పాచిపట్టి ఉండటం వలన సంఘటన జరిగిందని వివరించారు. నిర్దేశిత సమయంలో మార్గదర్శకాలకు అనుగుణంగా పర్యవేక్షణలో లోపాలు నివారించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్.ఓ నీటి సరఫరాలోనూ లోపాలు నివారించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె.విజయ లక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు యు.చెన్నయ్య, బిసి సంక్షేమ శాఖ ఉప సంచాలకులు మయూరి, దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు డి. దుర్గా భాయి, తదితరులు పాల్గొన్నారు.







