
Guntur:పత్తిపాడు:14-10-25:-ఈ నెల 16న కర్నూలులో నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో మరియు బహిరంగ సభను ఘనవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూడుపార్టీల కూటమి నేతలు, కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే డాక్టర్ ప్రత్తిపాటి పుల్లారావు.సోమవారం పత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కే.ఈ. శ్యాంకుమార్ (శ్యాంబాబు), ఇతర నేతలతో కలిసి సమావేశమైన ఆయన, మోదీ పర్యటనను జాతీయ స్థాయిలో ప్రదర్శనగా మలచేందుకు కూటమి శ్రేణులు కృషిచేయాలని పిలుపునిచ్చారు. “వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనపెట్టి, పార్టీ ఆదేశాలకు కట్టుబడి, రోడ్ షోను దేశం గర్వించే స్థాయిలో విజయవంతం చేయాలి,” అని పుల్లారావు పిలుపునిచ్చారు.
“చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమానికి మారుపేరుగా నిలుస్తున్నారు”
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం మధ్య సైతం సీఎం చంద్రబాబు నాయకత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రస్తావించిన పుల్లారావు, “దేశంలో ఎవరికీ సాధ్యం కానివి, మన ముఖ్యమంత్రి ప్రజలకు అందిస్తున్నారు. దీని పట్ల మూడుపార్టీల శ్రేణులు గర్వించాలి,” అని వ్యాఖ్యానించారు.స్త్రీ శక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం 2.0, మెగా DSC, అన్న క్యాంటీన్లు వంటి పథకాలతో పాటు, దేశంలోనే ఎక్కడా లేని విధంగా సామాజిక పింఛన్లు అందించడంలో రాష్ట్రం ముందుందని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల నష్టపోతున్న ఆటోడ్రైవర్లకు రూ.440 కోట్లు పంపిణీ చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ, త్వరలో నిరుద్యోగ భృతి కూడా అమలు చేయనున్నారని తెలిపారు.
“పస్తులుంచరు.. మంచి విందుభోజనమే పెడతారు”
“తనను నమ్మి కృషి చేసిన టీడీపీ శ్రేణులకు చంద్రబాబు, లోకేశ్‌లు మంచి విందుభోజనం పెడతారు గానీ, పస్తులుంచరు,” అంటూ కార్యకర్తలకు భరోసానిచ్చారు. కూటమి పార్టీల శ్రేణులు ప్రజల నాడిని అర్థం చేసుకుంటూ పని చేయాలని, అప్పుడే రాజకీయంగా నిలదొక్కుకోవచ్చని పుల్లారావు హితవు పలికారు.సమావేశంలో పత్తికొండ ఎమ్మెల్యే కే.ఈ. శ్యాంకుమార్, తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్‌ఛార్జ్ వలవల బాబ్జీ, టీడీపీ, బీజేపీ, జనసేన కీలక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.







