
బాపట్ల జిల్లా: పర్చూరు:14-10-25:-చిన్నగంజాం మండలంలోని వివిధ ప్రాంతాల్లోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద పచ్చని తీగలు అలముకున్నాయి. వీటి వల్ల ఎప్పుడు ప్రమాదం సంభవించవచ్చన్న భయాందోళనలు ప్రజల్లో కనిపిస్తున్నా, విద్యుత్ శాఖ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రోజు రోజుకు ట్రాన్స్‌ఫార్మర్లకు చుట్టూ పెరిగిపోతున్న తీగలు, చెట్లు విద్యుత్ తీగలను తాకే ప్రమాద స్థితికి చేరుకున్నాయి. ముఖ్యంగా, రహదారి పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర నిత్యం వాహనాల రాకపోకలు, పాదచారుల కదలికలు ఎక్కువగా ఉంటున్నా సంబంధిత అధికారులు చలనం లేని విధంగా ఉండడం ప్రశ్నార్ధకంగా మారింది.చిన్నగంజాం మండల పరిధిలో మొత్తం 12 పంచాయతీలు ఉండగా, ఏ పంచాయతీలోనూ ఈ సమస్య తారాస్థాయికి చేరినట్టు ప్రజలు చెబుతున్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది ప్రజల భద్రత కన్నా రొయ్యల చెరువులపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రమాదం జరిగాక ముందే నివారణ చర్యలు తీసుకోవాలని, వెంటనే సంబంధిత ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.






