
బాపట్ల, అక్టోబర్ 14:ఆచార్య నాగార్జునా విశ్వవిద్యాలయ పరిధిలో ఇటీవల నిర్వహించిన అంతర్ కళాశాలల క్రీడా పోటీల్లో బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు తమ అద్భుత ప్రతిభతో విజయ దుందుభిని మోగించారు.యోగా విభాగంలో నిర్వహించిన పోటీల్లో కళాశాల విద్యార్థి శ్రీ పి. డి. వరుణ్ రాజ్ మరియు కుమారి పి. శ్రావణి మొదటి బహుమతిని సాధించగా, మరో విద్యార్థిని కుమారి పి. శ్రావ్య మూడవ స్థానం దక్కించుకుంది.
ఈ విజయంతో వారంతా డిసెంబర్ 24 నుండి 28 వరకు జరగనున్న జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు చెన్నైలోని వెల్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మరియు ఎస్.వి.వై.ఎస్.ఏ. యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించనున్నారు.విజేతలకు అభినందనలు తెలుపుతూ కళాశాల ప్రిన్సిపాల్ డా. యన్. రమా దేవి గారు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల కృషి, పట్టుదల ఫలితంగా ఈ ఘనత సాధ్యమైందన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు శ్రీ ముప్పలనేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ, “బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు కేవలం సాంకేతిక విద్యలోనే కాకుండా క్రీడా రంగంలోనూ ప్రతిభను చాటుతున్నారు. ఇది ఎంతో గర్వకారణం,” అన్నారు. క్రీడలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.సొసైటీ సెక్రటరీ శ్రీ మానం నాగేశ్వరరావు గారు విజేతలను అభినందిస్తూ, విద్యార్థులను అన్ని రంగాలలో ప్రోత్సహించడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. జాయింట్ సెక్రటరీ శ్రీ దొడ్డపనేని వెంకయ్య చౌదరి గారు కూడా కార్యక్రమంలో పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ గారికి మరియు బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ యాజమాన్యానికి పీ.డి. డాక్టర్ వి. మల్లికార్జున రావు గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.







