
అమరావతి: 14-10-25:-మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు చర్య అని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ మండిపడ్డారు. ఇటీవల రాజకీయ విమర్శల సందర్భంలో తెలుగుదేశం నేత బొల్లా బ్రహ్మనాయుడు చేసిన “మహిళలు తాగుబోతులు” అన్న వ్యాఖ్యలపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది.
ఈ వ్యాఖ్యలను అత్యంత సీరియస్‌గా పరిగణిస్తున్నామని పేర్కొన్న శైలజ, మహిళలపై ఇలాంటి అసభ్య వ్యాఖ్యలు చేయడం అభ్యంతరకరమని, వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని బ్రహ్మనాయుడుకు హెచ్చరిక జారీ చేశారు.“రాజకీయ విమర్శలు ఒక ఎత్తు, కానీ మహిళల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు మరొకటి. ఇలాంటి మాటలు చెప్పే వారిపై మహిళా కమిషన్ కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడదు,” అని శైలజ హెచ్చరించారు.బొల్లా బ్రహ్మనాయుడు క్షమాపణ చెప్పకపోతే, ఆయనపై విచారణ ప్రారంభించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించమని ఆమె హెచ్చరించారు.







