
జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. మంగళవారం వట్టిచెరుకూరు మండలం కూర్నూతల గ్రామంలో సిసిఐ పత్తి కొనుగోలుకు నోటిఫై చేసిన గాయత్రి కాటన్ ప్రెస్సింగ్ మిల్లు వద్ద పత్తి కొనుగోలు సన్నద్ధత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మిల్లు సమీపంలో సాగులో ఉన్న పత్తి పంటను,పరిశీలించి, పంట పరిస్థితిని, సాగు ఖర్చులు, దిగుబడి తదితర వివరాలను రైతుల ద్వారా తెలుసుకున్నారు.
పత్తి పంట సాగు వివరాలను రైతులు జిల్లా కలెక్టర్ కు తెలియజేస్తూ రెండు, మూడు వారాల్లో పత్తి మొదటి కోతకు సిద్ధమవుతుందని, దిగుబడిని బట్టి మూడు నాలుగు కోతలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల పత్తి దిగుబడి కొంత తగ్గే అవకాశం ఉందని, ఎకరాకు సాగు ఖర్చులు రూ. 50 వేల వరకు అవుతున్నాయని తెలిపారు. కోస్తా ఆంధ్రాలో వాతావరణ పరిస్థితుల వలన తేమ శాతం ఎక్కువుగా ఉంటుందని సీసీఐ పత్తి కొనుగోలుకు నిర్దేశించిన 6.5% తేమను 15% కు పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
అనంతరం గాయత్రి కాటన్ ప్రెస్సింగ్ మిల్లులో జిన్నింగ్ మిషన్ల ద్వారా పత్తి నుంచి దూదిని తీసే ప్రక్రియను, ప్రెస్సింగ్ యూనిట్ ద్వారా దూదిని బేళ్ళుగా కట్టే విధానంను పరిశీలించారు. సీసీఐ ద్వారా ప్రతి కొనుగోలుకు సంబంధించి సన్నద్దత ఏర్పాట్లు గురించి వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖ, కాటన్ మిల్లుల నిర్వాహకులతో చర్చించి సూచనలు అందించారు. ఈ సందర్భంగా కాటన్ మిల్లుల నిర్వాహకులు మాట్లాడుతూ జిన్నింగ్ మిల్లులకు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, తెలంగాణ నుంచి తీసుకువచ్చే పత్తికి మార్కెట్ సెస్ రాయితీ ఇవ్వాలని ప్రభుత్వానికి తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అయితా నాగేశ్వరరావు, వ్యవసాయ మార్కెటింగ్ ఎడి సత్యనారాయణ చౌదరి, తహసిల్దారు క్షమారాణి, కాటన్ మిల్లు నిర్వాహకులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.






