
విజయవాడ, అక్టోబర్ 14: రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాలను అడ్డుకునేందుకు ఎక్సైజ్ శాఖ మరింత కఠినంగా వ్యవహరించాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ఆన్‌లైన్ సమీక్షా సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఎక్సైజ్ డైరెక్టర్ చామకూరి శ్రీధర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ తదితర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా డెప్యూటీ కమిషనర్లు నుండి స్టేషన్ హౌస్ అధికారుల వరకు ఫీల్డ్ అధికారులు హాజరైన ఈ సమావేశంలో నకిలీ మద్యం ఆరోపణలపై మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్సైజ్ చట్టాల అమలులో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. “బెల్ట్ షాపులు లేదా అనధికారికంగా మద్యం అమ్మకాలు ఎక్కడైనా కనిపిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి. పర్యవేక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయండి,” అని మంత్రి ఆదేశించారు.ఈ సందర్భంగా ఎక్సైజ్ డైరెక్టర్ చామకూరి శ్రీధర్, “ఏపీ ఎక్సైజ్ సురక్ష” మొబైల్ యాప్‌ను ప్రత్యక్షంగా పరిచయం చేశారు. లైసెన్సుదారులు తక్షణమే ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి యాక్టివేట్ చేయాలని సూచించారు.అక్టోబర్ 16వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని రిటైల్ లిక్కర్ విక్రయాలు తప్పనిసరిగా “ఏపీ ఎక్సైజ్ సురక్ష (రిటైలర్)” యాప్ ద్వారానే జరగాలని, ప్రతి మద్యం సీసాపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి దాని నాణ్యతను నిర్ధారించాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.ప్రభుత్వం పారదర్శకత, వినియోగదారుల భద్రత, నకిలీ మద్యం నిర్మూలన పట్ల కట్టుబడి ఉందని, సాంకేతికత ఆధారంగా ఎక్సైజ్ శాఖ పనితీరును మరింత బలోపేతం చేయాలని మంత్రి పేర్కొన్నారు.







