Guntur News: ఎన్నికల్లో ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలి
VOTE AWARENESS PROGRAM
ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం జనవరి 25 వ తేదిన దేశ వ్యాప్తంగా ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్. నాగలక్ష్మీ పేర్కొన్నారు. శనివారం 15 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కలక్టరేట్ లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎస్. నాగలక్ష్మీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.యస్.బి.జి.పార్థ సారధి , నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు , డిఆర్ఓ షేక్. ఖాజవలి , ఆర్డిఓ శ్రీనివాస రావు , నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఓబులేశు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ మాట్లాడుతూ 1950 జనవరి 25 న ఎలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడి ఇప్పటికీ 75 సంవత్సరాలు పూర్తి అయిందన్నారు. 2011 వ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం జనవరి 25 వ తేది ఎలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పడిన తేదీని ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత దేశం అత్యంత ప్రజాస్వామిక దేశ మన్నారు. గత 75 సంవత్సరాలుగా ఎన్నికల విధానంలో ఎన్నో మార్పులను ఎన్నికల కమిషన్ తీసుకువచ్చిందని వెల్లడించారు. చేయి ఎత్తి ఎన్నుకునే దగ్గర నుండి బ్యాలెట్ పేపర్ తో ఓటు నుండి ఈవీయం ల ద్వారా ఓటు వేసే వరకు మార్పులు వచ్చాయన్నారు. ఎన్నికల్లో అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు , దివ్యాంగులు , సీనియర్ సిటీజన్లకు , కుల మతాలకు అతీతంగా , లింగ వివక్ష లేకుండా ఓటు హక్కును కల్పించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు దివ్యాంగులకు , సీనియర్ సిటీజన్లకు హోమ్ ఓటింగ్ కల్పించడం జరిగిందన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య భారత దేశంలో ఎన్నికలు నిర్వహిస్తున్నపుడు అంతర్జాతీయ మీడియా కూడా దృష్టి పెడుతుందన్నారు. డబ్బుకు, ప్రలోభాలకు లొంగకుండా స్వచ్చంధంగా ఓటు వేయడం మన నుండే ప్రారంభమయ్యేట్లు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలన్నారు. ఓటు అనేది ప్రజల చేతిలో ఉన్న ఆయుధమని , రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును జిల్లాలో నమోదు అయిన ప్రతి ఓటరు వినియోగించుకుని ఎన్నికల్లో ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని కోరుతున్నానన్నారు.