
బాపట్ల:15-10-2025:బాపట్ల జిల్లాకు కొత్తగా నియమితులైన సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌కు చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం లభించింది. డీఆర్ఓ గంగాధర్ గౌడ్, కలెక్టరేట్ ఏఓ మల్లిఖార్జున రావులు పుష్పగుచ్ఛాలతో ఆమెకు స్వాగతం పలికారు. వేదపండితులు వేదమంత్రాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సంయుక్త కలెక్టర్ భావన వశిష్ట పుష్పగుచ్ఛం అందజేశారు. అలాగే, వివిధ శాఖల అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “బాపట్ల జిల్లాలో సంయుక్త కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రజలకు మేలు చేయడమే నా ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో ప్రాధాన్యతనిస్తా. రెవెన్యూ వ్యవస్థను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థను సమర్థంగా నిర్వహించేందుకు కృషి చేస్తాం,” అని తెలిపారు.2019 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన భావన వశిష్ట, గతంలో కృష్ణా జిల్లాలో ఏసీ యుటీగా, పార్వతీపురంలో సబ్ కలెక్టర్‌గా, ASR జిల్లాలో సంయుక్త కలెక్టర్, రిటర్నింగ్ అధికారిగా, జీఎస్‌ఎస్‌డబ్ల్యూఎస్ రీజనల్ జాయింట్ డైరెక్టర్‌గా, కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా సేవలందించారు. ఇటీవల బాపట్లకు సంయుక్త కలెక్టర్‌గా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆమె బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు పి. గ్లోరియా, చంద్రశేఖర్ నాయుడు, యన్. రామలక్ష్మి, బాపట్ల తహసీల్దార్ సలీమా షేక్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







