
విజయవాడ, అక్టోబర్ 15:-విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు విదేశీ విద్యా పథకం కింద అర్హత సాధించిన కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి కులాల విద్యార్థులకు ప్రభుత్వం విడుదల చేయాల్సిన ఉపకార వేతనాల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడును బుధవారం తాడేపల్లిలోని కార్పొరేషన్ కార్యాలయంలో కలిశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ పిల్లలు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి అందాల్సిన ఆర్థిక సహాయం ఇంకా విడుదల కాలేదని, దీంతో వారికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. ఈ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి బకాయిలను వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతూ చైర్మన్‌కు వినతిపత్రాలు సమర్పించారు.వారి సమస్యలను గమనించిన చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు స్పందిస్తూ, ‘‘విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ బకాయిల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాను,’’ అని హామీ ఇచ్చారు.







