
గుంటూరు, అక్టోబర్ 15:గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా మంగళవారం ఏపీఐఐసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇండస్ట్రీ పార్ట్‌నర్‌షిప్ డ్రైవ్ పోస్టర్‌ను విడుదల చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పోస్టర్‌ను ఆవిష్కరించారు.నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్టనర్‌షిప్ సమిట్ కు ప్రాథమికంగా అవగాహన కల్పించే ఉద్దేశంతో పోస్టర్‌ను విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమిట్ సందర్భంగా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు నెల రోజుల పాటు విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్టు చెప్పారు.
ఇందులో భాగంగా పరిశ్రమల ఆధునికీకరణ, పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమల అభివృద్ధి, శుభ్రతపై దృష్టి సారించనున్నట్టు పేర్కొన్నారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశముందని అన్నారు. సదస్సులో జిల్లా నుండి అధిక సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, సంస్థలు పాల్గొనాలని కలెక్టర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజనీరు ఎం.డి. నజీనా బేగం, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ డా. ఎం.ఎల్. నరసింహారావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఏ. జయలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు.







