
గుంటూరు, అక్టోబర్ 16: సర్వైకల్ క్యాన్సర్ వ్యాధిని నివారించేందుకు బాలికలకు వ్యాక్సినేషన్ అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అన్నారు. గురువారం నగరంలోని విజ్ఞాన్ కళాశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోటరీ క్లబ్ సమాజంలోని అనేక వ్యాధుల నివారణలో విశేష కృషి చేస్తోందని ప్రశంసించారు. పోలియో నిర్మూలన, క్యాన్సర్ నివారణ వంటి కార్యక్రమాల్లో రోటరీ క్లబ్ పాత్ర ఆదర్శనీయమని తెలిపారు. “జబ్బు వచ్చిన తర్వాత చికిత్స కన్నా, ముందే జాగ్రత్తలు తీసుకోవడం మిన్న. సర్వైకల్ క్యాన్సర్ నివారణలో వ్యాక్సినేషన్ కీలకంగా మారింది,” అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1332 మంది బాలికలకు వ్యాక్సిన్ వేయడం గర్వకారణమన్నారు.
ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ 3150 గవర్నర్ డా. శివరాం ప్రసాద్ మాట్లాడుతూ, పోలియో నిర్మూలనలో రోటరీ క్లబ్ చేసిన సేవలు ఫలితంగా భారతదేశం నేడు పోలియో రహిత దేశంగా మారిందన్నారు. అదే విధంగా సర్వైకల్ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా రోటరీ క్లబ్ పనిచేస్తోందని చెప్పారు. ఈ వ్యాధి వలన ప్రతి ఏడాది వేలాది మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారురోటరీ క్లబ్ పూర్వ గవర్నర్ డా. రవి వడ్లమాని మాట్లాడుతూ, క్యాన్సర్ నివారణ కోసం రోటరీ క్లబ్ చేపడుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర కోశాధికారి రామచంద్రరాజు, రోటరీ క్లబ్ ప్రతినిధులు వందన్ భల్ల, వీరేంద్ర మెహతా, రోటరీ ఇన్నర్ వీల్ ప్రతినిధి ఎల్. సరిత, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు అధ్యక్షులు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.







