
బాపట్ల, అక్టోబర్ 16:డిసెంబరు నుండి జిల్లాలో వరి ధాన్యం కోతలు ప్రారంభం కానుండటంతో, వరి ధాన్యం సేకరణకు అవసరమైన ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వి. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలం కూచిపూడి గ్రామంలో ఉన్న రైస్ మిల్లును, రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సేకరించేందుకు అన్ని సదుపాయాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. రైతులు పండించే ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసేందుకు రైస్ మిల్లులు, రైతు సేవా కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.ధాన్య సేకరణకు అవసరమైన ఖాళీ గోతాలు, తేమ శాతం కొలిచే పరికరాలు తదితరాలను ముందుగానే సిద్ధం చేయాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు, నిల్వ ప్రక్రియల్లో పారదర్శకత పాటించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ తనిఖీల్లో రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి రామలక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి సుబ్రహ్మణ్యేశ్వరరావు, అమృతలూరు తహశీల్దార్ నెహ్రూ బాబు, ఇతర వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.







