
గుంటూరు, అక్టోబర్ 16:జీఎస్టీ తగ్గింపు సామాన్యులు, మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఊరటను అందించిందని గుంటూరు తూర్పు శాసన సభ్యులు నసీర్ మహమ్మద్ తెలిపారు. “సూపర్ జీఎస్టీ – సూపర్ పొదుపు” ప్రచారంలో భాగంగా గురువారం గుంటూరులో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో, పయనీర్ ఆటోమొబైల్స్ మహీంద్రా వాహనాల డీలర్ ల సహకారంతో నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడిన నసీర్ మహమ్మద్, “ప్రతి వస్తుపై జీఎస్టీ తగ్గించడం ద్వారా ప్రజలపై ఆర్థిక భారం తగ్గించగలిగాం. అయితే దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8 వేల కోట్ల అదనపు భారం ఏర్పడింది. అయినా పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడకుండా కూటమి ప్రభుత్వం ధైర్యంగా ఈ నిర్ణయం తీసుకుంది” అన్నారు.అధ్యక్షత వహించిన ఉప రవాణా కమిషనర్ కె. సీతారామిరెడ్డి మాట్లాడుతూ, వాహనాలపై జీఎస్టీ తగ్గింపుతో వినియోగదారులకు స్పష్టమైన లాభం కలుగుతోందన్నారు. “వాహనాల కొనుగోలుపై జీఎస్టీ 28 శాతం నుండి 18 శాతానికి, ట్రాక్టర్లపై 12 శాతం నుండి 5 శాతానికి, సరుకు రవాణా వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌పై 12 శాతం నుండి 5 శాతానికి, వాహనాల స్పేర్ పార్ట్స్‌పై 28 శాతం నుండి 18 శాతానికి తగ్గింపు అమలులోకి వచ్చింది” అని వివరించారు.జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమానికి ఎనిమిది వందలకుపైగా వాహన వినియోగదారులు, వాహన డీలర్లు, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్లు, ఆటో యూనియన్లు, ఆటో నగర్ కార్మికులు హాజరయ్యారు. అలాగే, ఆర్‌టిఓ శ్రీహరి, పయనీర్ ఆటో వరల్డ్ ఎండి జి. చక్రధర్, మోటార్ వాహన తనిఖీ అధికారులు వి. విజయసారధి, కె. మల్లేశ్వరి, జి. సౌజన్య, జీఎస్టీ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.







