
గుంటూరు, అక్టోబరు 17:-జిల్లాలో రక్తహీనత సమస్యను నిర్మూలించేందుకు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “రక్తహీనత గల చిన్నారులు, గర్భిణీలు, బాలింతలను గుర్తించి వారికి తగిన చికిత్స, పోషకాహారం అందించాలి. గ్రామ సచివాలయం స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి, వారిని పర్యవేక్షించాలని” అన్నారు.అలాగే, రక్తహీనత గల వారి జాబితాను ఖచ్చితంగా తయారు చేయాలని, ప్రతి వారం పరిస్థితిని పరిశీలించి మెరుగుదలను గమనించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. “ఆహారం అందించినప్పటికీ రక్తహీనత తగ్గకపోతే, దానికి గల కారణాలను విశ్లేషించాలి. ఆరోగ్య అలవాట్లపై అవగాహన కల్పించాలి,” అని సూచించారు.అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు సరైన పోషకాహారం అందించాలనీ, వారి ఎత్తు, బరువు, మానసిక ఎదుగుదల వంటి అంశాలపై పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.
బాల్యవివాహాలపై కూడా కలెక్టర్ ఆందోళనజిల్లాలో బాల్యవివాహాల పరిస్థితిని అరికట్టాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తమీమ్ స్పష్టం చేశారు. “ఏ గ్రామాల్లో బాల్యవివాహాలు జరుగుతున్నాయో గుర్తించి, అక్కడ కమిటీ సభ్యుల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. బాల్యవివాహాల వల్ల బాలికల ఆరోగ్యంతో పాటు భవిష్యత్తుపై ప్రభావం పడుతుంది,” అని హెచ్చరించారు.విద్యాసంస్థల్లో చదువుతున్న బాలికల పట్ల కూడా ప్రత్యేక పర్యవేక్షణ అవసరం ఉందని, వారికి ఆరోగ్యం, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుందన్నారు.
పోక్సో కేసుల పరిష్కారం వేగవంతం చేయాలిపోక్సో కేసులు నిర్దేశిత కాలంలో పరిష్కారమవలసిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి ప్రసూన, అదనపు ఎస్పీ రమణమూర్తి, జెడ్పీ సీఈవో వి. జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, దివ్యాంగుల శాఖ సహాయ సంచాలకులు డి. దుర్గా భాయి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తదితరులు పాల్గొన్నారు.







