
Parvathipuram Manyam:సాలూరు, అక్టోబర్ 17:-సాలూరు పట్టణంలోని పలు హాస్టళ్లలో విద్యార్థులు అనారోగ్యానికి గురైన ఘటనపై రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి స్వయంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు.అనారోగ్యానికి గురైన విద్యార్థులను సాలూరు ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC) లో ప్రత్యక్షంగా పరామర్శించిన మంత్రి, వైద్యులతో విద్యార్థుల ఆరోగ్య స్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు.

ప్రస్తుతం మొత్తం 21 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరికి జాండీస్, ఒకరికి మలేరియా, మిగిలిన వారికి తేలికపాటి జ్వరం, అలసట వంటి లక్షణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.పీహెచ్సీలలో వైద్యుల సమ్మె కారణంగా వివిధ ప్రాంతాల నుండి విద్యార్థులను సాలూరు CHC కి తరలించి చికిత్స అందిస్తున్నారని అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ మంత్రి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు.ఆసుపత్రిలో విద్యార్థులతో మాట్లాడిన మంత్రి, “ప్రభుత్వం ప్రతి విద్యార్థి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ చూపిస్తుంది.
అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు సమయానికి అందేలా చర్యలు తీసుకున్నాం” అని తెలిపారు.అదే సమయంలో, హాస్టళ్లలో ఆహార నాణ్యత, తాగునీటి పరిశుభ్రత, పరిసరాల శుభ్రతపై పూర్తి స్థాయి సమీక్ష చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.విద్యార్థులందరూ పూర్తిగా కోలుకునే వరకు జాగ్రత్తగా పర్యవేక్షించాలని వైద్యులకు సూచించిన మంత్రి, వారి ఆరోగ్య పరిస్థితి పై తనకు నిరంతరం నివేదికలు అందించాలన్నది స్పష్టం చేశారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.తల్లిదండ్రులు, విద్యార్థులతో మాట్లాడిన మంత్రివర్యులు, “ప్రతి చిన్నారి ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైనది. పిల్లలు త్వరగా కోలుకుని తిరిగి పాఠశాలలకు చేరుకోవాలి” అని ఆకాంక్షించారు.






