
గుంటూరు, అక్టోబర్ 17 :పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఆధార్ నమోదు ప్రక్రియను వచ్చే నెలరోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జనన ధృవీకరణ పత్రాలు లేని విద్యార్థులను గుర్తించి, వెంటనే దరఖాస్తులు చేసి ధృవీకరణ పత్రాలు పొందేలా చూడాలని సూచించారు. తద్వారా ఆధార్ నమోదు వేగంగా పూర్తవుతుందని తెలిపారు.
ఆధార్ నమోదు కార్యక్రమాన్ని నెలరోజుల్లో పూర్తిచేయాలని, అక్టోబర్ 23 నుండి 30వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ సూచించారు.జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి సంజీవరావు మాట్లాడుతూ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని, నర్సింగ్‌లో అనుభవం కలిగిన ఎస్‌సి అభ్యర్థులకు జర్మన్ భాషా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. సాఫ్ట్ స్కిల్స్, పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహక కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు వివరించారు.ఈ సమావేశంలో డిగ్రీ కళాశాలల ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కళావతి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి. ప్రసూన, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె. విజయలక్ష్మి, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి. విజయలక్ష్మి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక తదితరులు పాల్గొన్నారు.







