
విజయవాడ: అక్టోబర్ 21:-ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. యువతరాన్ని ముందుకు తెచ్చే దిశగా పార్టీ తీసుకున్న కీలక నిర్ణయాలతో పార్టీ లో చైతన్యం నిండిపోయింది. కడప జిల్లా తొండూరు మండలం భద్రంపల్లెకు చెందిన పేదింటి బిడ్డ, విద్యార్థి ఉద్యమాల నుండి రాజకీయ నాయకత్వం వరకు దశలవారీగా ఎదిగిన కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య గారు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.కష్టాల మధ్య పుట్టి, కూలి పనులు చేస్తూ, అనాధ విద్యాలయంలో చదువుకున్న ఈశ్వరయ్య గారు, చిన్ననాటి నుంచే ఆకలి బాధలు, పేదరికం అంటే ఏమిటో ప్రత్యక్షంగా అనుభవించారు. అదే జీవన పోరాటం ఆయన్ని ప్రజా ఉద్యమాల దిశగా నడిపించింది. ఏడవ తరగతి చదువుతూనే ఏఐఎస్ఎఫ్ లో చేరి, విద్యార్థుల హక్కుల కోసం కదిలిన ఈశ్వరయ్య గారు, “చదువు… పోరాడు” అనే నినాదాన్ని జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు.
డిగ్రీ చదువుతున్న రోజులలోనే విద్యార్థి స్కాలర్‌షిప్ సమస్యలపై కడపలో మొదటి స్థాయి పోరాటాలు నడిపి, అణగారిన విద్యార్థులకు సహాయం అందేలా చేసిన ఈశ్వరయ్య గారిని కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శిగా నియమించింది. అనంతరం ఎస్వీయూ లో ఎంఏ చదువుకుంటూ విద్యార్థి ఉద్యమాలను మరింత బలోపేతం చేశారు.విద్యార్థి నాయకత్వం తర్వాత అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్), అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన ముద్ర వేశారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యావిధానాలపై తీసుకున్న అన్యాయ నిర్ణయాలను ఎదుర్కొని, విద్యార్థి, యువజన ఉద్యమాలకు జీవం పోశారు. ముఖ్యంగా బీకాం అభ్యర్థులకు బీఈడ్ ప్రవేశాలను నిరాకరించిన ప్రభుత్వ నిర్ణయంపై చేసిన పోరాటం ఫలితంగా జీవో రద్దయింది.యువజన సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర విజయవంతం కావడంలో ఆయన పాత్ర విశేషమైంది. ఆ తర్వాత సీపీఐలోకి ప్రవేశించి కడప జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి, జిల్లాలో పార్టీ పునర్నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేశారు.పాత రిమ్స్ ఆసుపత్రి పునరుద్ధరణ, కడప స్టీల్ ప్లాంట్ ఉద్యమం, పేదలకు ఇళ్ల స్థలాలు వంటి ప్రజా సమస్యలపై పోరాడి జైలు జీవితం కూడా గడిపారు. పార్టీ కార్యాలయాన్నే తన నివాసంగా మార్చుకొని పేదల మధ్య మమేకమై పనిచేసిన ఆయన, నిజమైన కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగారు.తరువాత రాష్ట్రస్థాయిలో పార్టీ బాధ్యతలు స్వీకరించి విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించారు. ఏ జిల్లాకు ఇన్‌చార్జ్‌గా వెళ్ళినా సమర్థంగా పనిచేసి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేశారు. ఆ కృషే నేడు ఆయన్ని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి స్థానానికి చేర్చింది.బాల కార్మికుడిగా మొదలై కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగిన గుజ్జుల ఈశ్వరయ్య గారి జీవితం నేటి యువతకు ప్రేరణ. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలిచి ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేయనున్న ఆయనకు పార్టీ శ్రేణులు, ప్రజానీకం తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తున్నారు







