
Tirupati:శ్రీకాళహస్తి ;23-10-25;-పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభంతో శ్రీకాళహస్తీశ్వరాలయం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. గురువారం సాయంత్రం కోట మండపం వద్ద శ్రీకాళహస్తీశ్వర స్వామి సన్నిధిలో ఆకాశదీపం వెలిగించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈవో బాపిరెడ్డి కుటుంబ సభ్యులు ఆకాశదీపాన్ని వెలిగించి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో బాపిరెడ్డి మాట్లాడుతూ కార్తీక మాసం నవంబర్ 20 వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. కార్తీక మాసంలోని నాలుగు సోమవారాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ దర్శన సమయాల్లో మార్పులు చేసినట్లు వెల్లడించారు.మూడవ కాలాభిషేకం ఉదయం 10 గంటలకు, నాల్గవ కాలాభిషేకం మధ్యాహ్నం 5 గంటలకు దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆకాశదీపం వెలిగింపు కార్యక్రమ ఏర్పాట్లను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.భక్తులు అధిక సంఖ్యలో హాజరై భగవంతుడి దివ్యదర్శనం చేసుకున్నారు.







