
కందుకూరు, : కందుకూరులో ఇటీవల చోటుచేసుకున్న ఘటనను కుల ఘర్షణగా చూపిస్తూ ప్రాంతంలో ఉద్రిక్తత రేకెత్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు అసెంబ్లీ కన్వీనర్ నేతి మహేశ్వరరావు కందుకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “ఇద్దరు స్నేహితుల మధ్య వ్యక్తిగత ఘర్షణను కుల కోణంలోకి మళ్లించి ప్రజల్లో విద్వేషాలు రేపే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అలాంటి వారిని కందుకూరు ప్రజలు సమయోచితంగా అడ్డుకున్నారు,” అని తెలిపారు. అలాగే 99టీవీ వాక్యత బ్రహ్మనాయుడు, TKB JAC నాయకుడు దాసరి రాము చేసిన వ్యాఖ్యల్లో కులాన్ని, మహిళలను అవమానించే పదజాలం వినిపించిందని పేర్కొన్నారు. కందుకూరులో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి కుల రాజకీయ ప్రయత్నాలనైనా చట్టబద్ధంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఆడబిడ్డ భద్రత, చికిత్స ఖర్చులు, ఉద్యోగ అవకాశం వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. రైతు కులాలైన కమ్మ, కాపు, రెడ్డి, యాదవ సమాజాల మధ్య కలహాలు సృష్టించాలనుకునే వారి కుట్రలను రైతులు కలిసికట్టుగా ఎదుర్కొంటారని చెప్పారు.







