
కృష్ణా:గుడివాడ:28-10-25:-మొంతా తుఫాన్ నేపథ్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో విపత్తు స్పందన & అగ్నిమాపక శాఖ ముందస్తు సన్నాహకాలు ప్రారంభించింది. గుడివాడ అగ్నిమాపక శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఆంజనేయులు నేతృత్వంలో సన్నాహక కార్యక్రమాలు నిర్వహించారు. తుఫాన్ సమయంలో అత్యవసర సేవల కోసం ఉపయోగించే ఆస్కా లైటింగ్ యంత్రాన్ని అధికారులు పరీక్షించారు.

ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు అవసరమైన యంత్రాలు, సహాయక పనిముట్లను బృందాల వారీగా సిబ్బంది సిద్ధం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏడీఎఫ్ఓ ఆంజనేయులు మాట్లాడుతూ— తుఫాను సమీపిస్తోన్న నేపథ్యంలో గుడివాడలో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామని, ఇవి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
తుఫాన్ సంబంధిత సమాచారం ప్రభుత్వ బులెటిన్ ద్వారా నిరంతరం మీడియాకు చేరవేస్తామని, సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న అపోహలు, నకిలీ పోస్టులను ప్రజలు నమ్మవద్దని హెచ్చరించారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఓ మహబూబ్ సుభాని, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







