
సర్దార్ వల్లభాయ్ పటేల్ మహోన్నతుడని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ అన్నారు. మై భారత్ (నెహ్రూ యువ కేంద్ర) ఆధ్వర్యంలో శుక్రవారం “సర్దార్ @150 యూనిటీ మార్చ్” ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివాస్ (జాతీయ సమైక్య దినోత్సవం)లో భాగంగా ర్యాలీని జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ప్రభుత్వ మహిళా కళాశాల వరకు పెద్ద ఎత్తున సాగింది. మంత్రి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ ప్రభుత్వ మహిళా కళాశాల వరకు సాగింది. కళాశాలలో జరిగిన సమావేశంలో అతిధులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ చరిత్రలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు స్వర్ణాక్షరాలతో లిఖించవచ్చని అన్నారు. వల్లభాయ్ పటేల్ ను ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కీర్తించడం జరిగిందని చెప్పారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాకుండా, స్వాతంత్ర్యం అనంతరం దేశ ఐక్యతను సాధించిన మహానేతగా ఆయనకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. భారత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 562 దేశీయ సంస్థానాలను భారత రాజ్యాంగంలో విలీనం చేయించడంలో ఆయన అద్భుత కృషి మరువలేనిది అన్నారు. ధైర్యం, తెలివితేటలు, చర్చా పటిమతో ఈ మహత్తర కార్యక్రమాన్ని పూర్తి చేశారని కొనియాడారు. గుంటూరు తూర్పు శాసన సభ్యులు నషీర్ అహ్మద్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ప్రభావంతో స్వాతంత్ర్య ఉద్యమంలో చేరడం జరిగిందన్నారు. నాయకుడిగా ఆయన రైతులు, కార్మికులు, ప్రజల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అన్నారు. గుంటూరు పశ్చిమ శాసన సభ్యులు గల్లా మాధవి మాట్లాడుతూ సర్దార్ పటేల్ పరిపాలనలో క్రమశిక్షణ, న్యాయం, ప్రజాస్వామ్య విలువలు ప్రధానమయ్యాయని వివరించారు. ఆయన భారత పరిపాలన వ్యవస్థకు బలమైన పునాది వేసారని. ఆయన ఆలోచనలు, సేవలు నేటికీ భారత రాజకీయ నాయకులకు ప్రేరణగా నిలుస్తున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ కేవలం నాయకుడే కాదని, దేశ ఐక్యతకు చిహ్నం అన్నారు. ధైర్యం, దేశభక్తికి ప్రతీక అని, ఆయన త్యాగం, కర్తవ్య నిబద్ధత, దృఢ సంకల్పం భారత యువతకు ప్రేరణ అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, నగర పాలక సంస్థ కమిషనర్ పులి.శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలి, నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, మై భారత్ డిప్యూటీ డైరెక్టర్ కిరణ్మయి దేవిరెడ్డి, స్థానిక నాయకులు తిరుపతి రావు, జిల్లా అధికారులు, విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు.







